ప్రో G N సాయి బాబా తాజా లేఖా - Thummeda

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Your Ad Spot

Saturday, June 17, 2023

ప్రో G N సాయి బాబా తాజా లేఖా



ప్రియమైన వసంతా,

ఢిల్లీలో ఉన్న మీ ఇద్దరికీ, నాగపూర్ లో జైలులో ఉన్న నాకూ మధ్య ఉన్న భౌతిక దూరం వాస్తవంగా ఢిల్లీకీ నాగపూర్ కూ మధ్య దూరం కన్న చాల చాల ఎక్కువ. అది బహుశా ఏ కోట్ల కిలోమీటర్లు ఉంటుందో... కాని మన మనసులకే తెలిసిన భాషలో, అసలు ఎంతమాత్రమూ దూరం లేదని నేననుకుంటాను. కానైతే రాజ్య శక్తులు మన మధ్య దూరాన్ని మరిన్ని కోట్ల కిలోమీటర్లు పెంచితే ఎంత బాగుండు అనుకుంటుంటాయి. 


అమానుష చట్టాలూ, అంతకన్న అమానుషమైన చట్టపు అమలు పద్దతులూ మన హృదయ భాషలో కూడ మన మధ్య దూరాన్ని పెంచగలిగినంత శక్తి గలవి. మన నుంచి ఏడున్నర సంవత్సరాల జీవితం కత్తిరించబడింది. మనను వేరు చేసే కోట్లాది కిలోమీటర్ల దూరమూ కాలమూ తయారు చెయ్యబడ్డాయి. ఇంకా ఇదంతా సరిపోనట్టు, ఆ చీకటి శక్తులు మన చుట్టూ ఉన్న దీపాలన్నిటినీ ఆర్పియ్యదలిచాయి.

  

ఇక్కడింకా మండుటెండకాలం కొనసాగుతున్నది. నా అండా సెల్ నిప్పుల కుంపటి లాగనే ఉంది. నైరుతి రుతుపవనాలు విదర్భను జూన్ 20 కు ముందు చేరేలా లేవు. 

ఈలోగా ఎల్ నినో ప్రభావం వల్ల రుతుపవనాల కదలిక ఆగిపోవచ్చు. ఆ పరిణామాలన్నీ నావరకు నాకు దుర్భరమైనవి. భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఎల్ నినో ప్రభావం వల్ల దేశ వ్యాప్తంగానే ఈసారి వర్షాలు బాగా తగ్గిపోవచ్చు. నాగపూర్ కూ కాకినాడకూ రావాలనే నీ నిర్ణయం మార్చుకోవడం చాల మంచి పని. ప్రయాణంలో ఈ భయంకరమైన వడగాల్పులను నువ్వు తట్టుకుని ఉండేదానివి కాదు. 


నా సహాయకులు మా దుప్పట్లను నీళ్లలో ముంచి ఆ తడి దుప్పట్లను నా జైలు సెల్ చుట్టూ ఆరవేస్తున్నారు. ఇది ఏప్రిల్ నుంచి సాగుతున్నది. అలాగే వాళ్లు నా సెల్ నేల మీదంతా నీళ్లు పోసి పెడుతున్నారు. కాని కొద్ది నిమిషాల్లోనే ఆ దుప్పట్లన్నీ ఆరి, ఎండిపోయినట్టయిపోతాయి. నేల మీద నీరు ఆవిరైపోతుంది. ఉష్ణోగ్రతలు చూస్తే గత సంవత్సరాల్లో ఉన్నట్టు 46 డిగ్రీలో, 47 డిగ్రీలో లేవు, ఈసారి 43 డిగ్రీలు, 44 డిగ్రీలు మాత్రమే ఉన్నాయి. కాని ఈ సవత్సరం అకస్మాత్తుగా మారిన వేడి వల్ల, గాలిలో ఎక్కువ తేమ వల్ల, వాతావరణంలో వేడి భరించశక్యం కాకుండా ఉంది. ఎల్ నినో ప్రభావం గనుక మరింత తీవ్రంగా మారితే, నా ఆరోగ్య పరిస్థితీ చాల దారుణంగా మారిపోతుంది. సరిగ్గా కొత్త వాతావరణ మార్పులను తట్టుకోలేని దేశంలోని రైతాంగం పరిస్థితి లాగే. 


బోలెడంత ప్రేమతో

సాయి.

No comments:

Post a Comment

Post Top Ad

Your Ad Spot